తెలంగాణకు కేంద్రం మరో మెగా ప్రాజెక్టును ప్రకటించింది

తెలంగాణ కు కేంద్రం తీపి కబురు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా టెక్స్‌టైల్స్‌ పార్కుల్లో తెలంగాణ రాష్ట్రానికి చోటు దక్కింది. ఈరోజు పీఎం మిత్ర పథకం కింద ఏడు మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌లను ప్రధాని మోడీ ప్రకటించారు. అందులో తెలంగాణకు కూడా చోటు దక్కింది. గతంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో ప్రధాని మోడీ తెలంగాణకు టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఇస్తామని హామీ ఇవ్వగా.. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడింది.

రైతులకు, చేనేత కార్మికులకు ఉపయోగపడుతూ, యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్‌టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు. తెలంగాణ తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తం 7 మెగా టెక్స్టైల్స్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోడీ అధికారిక ప్రకటన చేసారు. ప్రధాని తెలంగాణ కు మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ప్రకటించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి థాంక్స్ తెలిపారు.