క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మిథాలీరాజ్

అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగిన మిథాలీ రాజ్
అందరి ఆశీర్వాదాలతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని వ్యాఖ్య


హైదరాబాద్ : ప్ర‌ఖ్యాత మ‌హిళా క్రికెట‌ర్‌, హైద‌రాబాదీ ప్లేయ‌ర్ మిథాలీ రాజ్‌ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగారు. కాసేపటి క్రితం తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. ప్రపంచ మహిళా క్రికెట్ లో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఘనత మిథాలీ రాజ్ తరపున ఉంది. ఇండియా తరపున ఆమె 232 వన్డేలకు ప్రాతినిథ్యం వహించారు. 50.68 యావరేజ్ తో 7,805 పరుగులను సాధించారు. 1999 జూన్ లో ఆమె అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా మిథాలీ రాజ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఇన్నేళ్ల పాటు మీరందరూ అందించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మీ అందరి ఆశీర్వాదాలతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని చెప్పారు. గత 23 ఏళ్ల క్రికెట్ జీవితంలో ఎన్నో చేర్చుకున్నానని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని… ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించానని అన్నారు. అన్ని ప్రయాణాల మాదిరే ఈ ప్రయాణం కూడా ముగిసిందని చెప్పారు.

మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి మన దేశ గెలుపుకోసం తన వంతు కృషి చేశానని మిథాలి తెలిపారు. తనకు ఎంతో సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెపుతున్నానని చెప్పారు. ఎన్నో ఏళ్ల పాటు ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించడాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/