కీవ్​లో 3 నెలల తర్వాత తెరుచుకున్న థియేటర్

కీవ్ : మూడు నెలలకుపైగా రష్యా కొనసాగిస్తోన్న భీకర యుద్ధంతో ఉక్రెయిన్‌ నగరాలు వణికిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాలు ఇప్పటికే రష్యా ఆధీనంలోకి వెళ్లిపోగా మరికొన్ని నగరాలు మాత్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో మూడు నెలల తర్వాత ఓ థియేటర్‌ తిరిగి తెరుచుకుంది. అయితే, ప్రదర్శన మొదలుపెట్టిన తొలిరోజే మూడు ఆటలకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం.

కాగా, భీకర యుద్ధం వేళ ఉక్రెయిన్‌ నగరాలపై విరుచుకుపడిన రష్యా సేనలు ఆ ప్రాంతాలను సర్వ నాశనం చేశాయి. ఇదే సమయంలో రాజధాని కీవ్‌పై దాడి చేసినప్పటికీ ఉక్రెయిన్‌ సేనల ప్రతిదాడులతో తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కీవ్‌లో రోజువారీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. వీటితోపాటు సినిమా థియేటర్లు, నేషనల్‌ ఒపేరా వంటి ప్రదర్శనశాలలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కీవ్‌ శివారులోని పొదిల్‌లో ఉన్న ఓ థియేటర్‌ కూడా ప్రదర్శనను మొదలుపెట్టింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/