29న మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్న మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు

Ministers Uttam and Sridhar Babu will visit Medigadda Barrage on 29th

హైదరాబాద్‌: ఈ నెల 29న మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న మంత్రులు.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులను గురించి వివరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగిన లాభ, నష్టాలు, ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు, ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్‌, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అనంతరం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శిస్తారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఈఎన్‌సీ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్ల, నిర్మాణంతో సంబంధమున్న అందరికి సమాచారం అందించాలని, పాల్గొనేలా చూడాలని స్పష్టం చేశారు.