కేజ్రీవాల్ స‌ర్కార్ నేర‌పూరిత నిర్ల‌క్ష్యం ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రిస్తోందిః బిజెపి

Delhi pollution: “Kejriwal criminal neglect is killing,” slams BJP

న్యూఢిల్లీ : అర‌వింద్ కేజ్రీవాల్ స‌ర్కార్ కాలుష్య నియంత్ర‌ణపై నేర‌పూరిత నిర్ల‌క్ష్యం ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రిస్తోంద‌ని బిజెపి దుయ్య‌బ‌ట్టింది. ఏయే వ‌న‌రుల నుంచి ఎంత మేర కాలుష్యం వెలువడుతున్న‌ద‌నేందుకు ఎలాంటి అధికారిక స‌మాచారం లేదని, ఢిల్లీ స‌ర్వీసుల మంత్రి, ఆప్ నేత అతిషి ప్ర‌క‌ట‌న‌ను బిజెపి ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల‌వీయ త‌ప్పుప‌ట్టారు.

ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తున్న కాలుష్యాన్ని నివారించేందుకు కేజ్రీవాల్ స‌ర్కార్ వ‌ద్ద ఎలాంటి విధానం లేద‌ని మండిప‌డ్డారు. పంజాబ్‌లో పంట వ్యర్ధాల‌ను త‌గుల‌బెట్ట‌డం వ‌ల‌నే ఢిల్లీలో వాయు కాలుష్యం తలెత్తుతుంద‌ని ఆప్ 2020లో పేర్కొంద‌ని, 2023లో మాత్రం ఢిల్లీలో కాలుష్యానికి కార‌ణాలేంట‌నేది తెలియ‌ద‌ని ఆప్ స‌ర్కార్ ఇప్పుడు చెబుతున్న‌ద‌ని బిజెపి నేత దుయ్య‌బ‌ట్టారు.

కాగా, కాలుష్యం ఏయే వ‌న‌రుల నుంచి వ‌స్తుంద‌నే వివ‌రాల‌కు సంబంధించి త‌మ వద్ద స‌మాచారం లేద‌ని, ఈ స‌మాచారం లేకుండా ప్ర‌భుత్వం కాలుష్యం నియంత్రించేందుకు ఎలాంటి విధానం రూపొందించ‌లేద‌ని, అదే పెను స‌మ‌స్య‌ని ఢిల్లీ మంత్రి అతిషి పేర్కొన్నారు. మ‌రోవైపు ఢిల్లీలో వాయు నాణ్య‌త పేల‌వ‌గానే కొన‌సాగుతోంది. వాయు నాణ్య‌త సూచీ (ఏక్యూఐ) శుక్ర‌వారం ఉద‌యం 249గా న‌మోద‌వ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తోంది.