తెనాలిలోని అన్నా క్యాంటీన్ వద్ద టెన్షన్ వాతావరణం..

గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలోని మార్కెట్‌ కూడలి అధికార, ప్రతిపక్ష పార్టీల పోటా పోటీగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. అన్నా క్యాంటీన్లు మూతపడిన నేపథ్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సారథ్యంలో ఆధ్వర్యంలో గత నెల 12 నుంచి అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తున్నారు. అయితే దానికి పోటీగా గత నెల 28న వైస్సార్సీపీ ప్రోత్సాహంతో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటిన అన్నదాన కార్యక్రమాలు నిలిపివేయాలని, ట్రాఫిక్‌ ఆంక్షలు ఉన్నాయని మున్సిపల్‌ అధికారులు నిర్వాహకులను కోరారు. అయినప్పటికీ ఈరోజు కూడా అన్నా క్యాంటీన్ ను ఓపెన్ చేస్తామని… ఆహారాన్ని పంపిణీ చేస్తామని టీడీపీ నేతలు చెప్పారు.

ఈ నేపథ్యంలో, టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగే అవకాశం ఉందనే సమాచారంతో క్యాంటీన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. చుట్టుపక్కలున్న షాపులను కూడా పోలీసులు మూసివేయించారు. దీంతో, అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. మరోవైపు షాపులను మూసివేయించడంపై వ్యాపారులు, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. మార్కెట్‌ ప్రాంగణంలోకి రాకపోకలు కూడా నిలిపివేస్తూ నలువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .కేవలం టీడీపీ చేపట్టిన అన్నా క్యాంటీన్‌ నిర్వహణను నిలిపివేయాలని దురుద్దేశంతోనే అధికార పార్టీ కుయుక్తులు పన్నిందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.