వివాదంలో చిక్కుకున్న మంత్రి తలసాని

వివాదాలకు దూరంగా ఉండే బిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..తాజాగా వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ చౌరస్తా వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జి (దివంగత నేత నాయిని నరసింహారెడ్డి ఫ్లైఓవర్‌)ని శనివారం మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు.

కాగా ఈ ప్రారంభ కార్యక్రమంలో ఓ వ్యక్తిని మంత్రి తలసాని కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బ్రిడ్జి చూసేందుకు ఓ వ్యక్తి తలసాని కంటే ముందు వెళ్లారు. దీంతో అతన్ని వెనక్కి లాగి, చెంప దెబ్బ కొట్టారు తలసాని. దీంతో మంత్రిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దక్షిణ భారత దేశంలో రహదారిపై భారీ పొడవున స్టీల్‌ వినియోగంతో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు ఇదే. రూ.450 కోట్లతో 2.63 కిలోమీటర్ల మేర ఈ ఉక్కు వంతెన నిర్మించారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే భూ సేకరణ అవసరం లేకుండా జరిగిన ప్రాజెక్టు, అందులో మెట్రో మార్గం మీదుగా ఈ స్టీట్‌ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహావిద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇందిరా పార్క్‌, అశోక్‌నగర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ట్రాఫిక్‌ సమస్య లేకుండా వీఎస్టీ జంక్షన్‌ వరకు సులభంగా వెళ్లొచ్చు.