ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి
అరటిలోడుతో వెళ్తున్న ట్రక్కు బోల్తా
16 killed, 5 injured after truck overturns in Maharashtra’s Jalgaon
ముంబయి: గత అర్ధరాత్రి మహరాష్ట్రాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. జల్గావ్ జిల్లాలోని కింగన్ వద్ద జరిగిన ట్రక్కు ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ కూలీలే. మృతుల్లో 8 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులను ఈ జిల్లాలోని అభోడా, కేర్హళ, రావెర్ గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు.
మహారాష్ట్రలోని ధూలే నుంచి రేవర్‌కు అరటిలోడుతో వెళ్తున్న ట్రక్కు కింగ్వాన్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో మొత్తం 21 మంది కార్మికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను రూరల్ ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.