తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా

Minister Sabitha released Telangana Inter results

హైదరాబాద్‌ః తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మం నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్యాల‌యంలో జ‌రిగింది. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 5 వరకు నిర్వహించిన ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫ‌స్టియ‌ర్ 4,33,082 మంది హాజ‌రైతే 2,72,208 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌స్టియ‌ర్‌లో 62.85 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. సెకండియ‌ర్‌లో 3,80,920 మంది హాజ‌రైతే 2,56,241 మంది ఉత్తీర్ణ‌త సాధించ‌గా, 67.27 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. మొత్తం ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియర్‌లో 61.68 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. కాగా, బాలిక‌లు 68.68 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ 2022-23 ఫ‌లితాల‌ను విడుద‌ల చేశాం. మార్చి 15 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. విద్యార్థి ద‌శ‌లో ఇంట‌ర్ అనేది కీల‌క‌మైంది. జీవితానికి ట‌ర్నింగ్ పాయింట్. మన రాష్ట్రంలో ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ 9,45,153 మంది హాజ‌ర‌య్యారు. 1473 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. 26 వేల మంది సేవ‌లందించారు. ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు స‌హ‌క‌రించిన అన్ని విభాగాల వారికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు అని స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ విష‌యంలో ఇంట‌ర్ వెయిటేజీని తీసేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. పిల్ల‌లు ఎవ‌రూ కూడా ఒత్తిడికి గురి కావొద్ద‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.