టెన్త్ హిందీ పేపర్ లీకీజీపై మంత్రి సబిత ఆరా..

వరంగల్ జిల్లాలో పదో తరగతి హిందీ పేపర్ లీక్ ఘటన ఫై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు. ఇటీవలి కాలంలో పేపర్ లీక్ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సంచలనంగా మారింది. లీకేజీ కేసులో సిట్‌ విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రశ్నపత్రం లీక్‌ చేసిన ప్రవీణ్‌, రాజశేఖర్‌, పరీక్షలు రాసిన వారు సహా మొత్తం 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఓవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ విచారణ జరుగుతుండగానే.. పదో తరగతి పేపర్లు లీక్ కావడం ప్రభుత్వాన్ని మరింత విమర్శలపాలు చేస్తుంది.

నిన్న వికారాబాద్ జిల్లా తాండూరులో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం కలకలం రేపింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు పదవ తరగతి పరీక్ష మొదలు కాగా.. ఏడు నిమిషాల తర్వాత (9.37 నిమిషాలకు) వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం లీక్ అయింది. పలు వాట్సాప్‌ గ్రూపులలో టెన్త్ క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టడంతో అందరూ షాక్ అయ్యారు. తెలుగు ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో ఇన్విజిలేటర్లు బండ్యప్ప, సమ్మప్పలను A1, A2 నిందితులుగా చేర్చారు. ఇక ఈరోజు వరంగల్‌ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయింది. హిందీ క్వశ్చన్ పేపర్‌ ఉదయం 9.30కే బయటకు వచ్చినట్లు వరంగల్ అధికారులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే హిందీ పేపర్ లీక్ అయినట్లు పేర్కొంటున్నారు. వరుస పేపర్ల లీక్ తో విద్యార్థులు, తల్లిదందడ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హిందీ పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ ఘటనపై అధికారలను ఆరా తీశారు. ప్రశ్నాపత్రం లీక్ కాలేదని వరంగల్, హనుమకొండ డీఈవోలు మంత్రికి తెలిపారు. పరీక్షలు సజావుగా సాగుతున్నాయని వివరించారు. నిజాలు తేల్చేందుకు సీపీకి ఫిర్యాదు చేయాలని మంత్రి.. అధికారులను ఆదేశించారు.