టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ను కలిసిన వైస్ షర్మిల

YSRTP అధినేత్రి వైస్ షర్మిల..మంగళవారం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ను కలిశారు. నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తో నిరుద్యోగులకు ఎంతో అన్యాయం జరిగిందని , వారికీ న్యాయం జరిగే వరకు కలసి పోరాడాలని , దానికి సంబంధించి వీరిద్దరూ చర్చలు జరిపినట్లు సమాచారం.

ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్య యువతను పట్టి పీడిస్తోందన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే మంచిదని తన అభిప్రాయమన్నారు. టి సేవ్ ఫోరం పేరుతో అందరం కలిసి పోరాడుదామని పిలుపిచ్చారు. నిరుద్యోగులకు భరోసా కోసమే టి సేవ్ ఫోరమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. షర్మిల వ్యాఖ్యలపై కోదండరాం సానుకూలంగా స్పందించారు. పార్టీలో చర్చించి నిర్ణయం తెలుపుతామని తెలిపారు.

ఇక తెలంగాణ లో మరో ఏడు , ఎనిమిది నెలల్లో ఎన్నికలు రాబోతుండడంతో వైఎస్ షర్మిల..మరింత దూకుడు పెంచుతున్నారు. ప్రతిపక్ష, విపక్ష పార్టీలను కలుపుకునే దిశగా పావులు కదుపుతున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష, విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ.. కేసీఆర్ వ్యతిరేక శక్తులను కూడగట్టేందుకు అడుగులు వేస్తోన్నారు. రీసెంట్ గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ , బండి సంజయ్ లకు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే.