నేటితో రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్‌ గడువు ముగింపు

presidential-election-nomination-ends-today

న్యూఢిల్లీ : నేటితో రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్‌ గడువు ముగియనుంది. భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 15న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అదేరోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. నేటితో ఆ గడువు ముగియనుంది. రేపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. జులై 2 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. వచ్చే నెల 21న ఓట్లను లెక్కించనున్నారు. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24న ముగియనుంది.

లోక్‌సభ, రాజ్యసభ, శాసన సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతి ఎన్నికవుతారు. పార్లమెంట్‌ హౌస్, రాష్ట్రాల శాసనసభల్లో రహస్య బ్యాలట్ విధానంలో పోలింగ్ జరుగుతుంది. కాగా, ఎన్డీయే తరఫున ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే వీరిరువురు తమ నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/