జగన్ కాన్వాయ్ కోసం ..ప్రయాణికుల కారును తీసుకెళ్లిన పోలీసులు

ఒంగోలు లో పోలీసులు చేసిన పనికి ప్రజలు మండిపడుతున్నారు. సీఎం జగన్ కాన్వాయ్ కోసం తిరుపతి వెళ్తున్న భక్తుల కారును పోలీసులు తీసుకొని వెళ్లారు. వివరాల్లోకి వెళ్తే ..పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్‌ తన ఫ్యామిలీ సభ్యులతో కలిసి తిరుమలకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆకలిగా ఉండటంతో బుధవారం రాత్రి సమయంలో ఒంగోలులోని స్థానిక పాత మార్కెట్‌ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్‌ చేస్తుండగా ఓ కానిస్టేబుల్‌ అక్కడికి వచ్చారు.

ఈ నెల 22న ముఖ్యమంత్రి జగన్ ఒంగోలు పర్యటన నేపథ్యంలో.. కాన్వాయ్‌ కోసం వాహనంతో పాటు డ్రైవర్‌ను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాము కుటుంబంతో తిరుమల వెళ్తున్నామని ..మీము ఎలా ఇవ్వడం సాధ్యపడుతుందని శ్రీనివాస్ అన్నారు. అయినప్పటికీ శ్రీనివాస్ మాటలను ఏమాత్రం వినకుండా డ్రైవర్‌ను..కారును తీసుకుని ఆ కానిస్టేబుల్‌ వెళ్లిపోయాడు. జగన్ కాన్వాయ్‌కు వాహనాలు కావాలంటే స్థానికులను అడిగి తీసుకోవాలనీ, దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న వారి నుంచి, అందునా మొక్కులు తీర్చుకునేందుకు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న వారి వాహనాలు లాక్కుని రోడ్డుపాలు చేయడం ఏమిటని వాపోయారు. అర్ధరాత్రి పూట ఇలా నడిరోడ్డు ఫై వదలడం ఏంటి అని వారు ఆగ్రహం వ్యక్తం చేసారు.మరి ఈ ఘటన పట్ల పోలీస్ అధికారులు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.