లోకేశ్ శ్రీకాకుళం రాకుండానే ప్యాకప్ చెప్పేశారు- మంత్రి బొత్స

‘జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. లోకేష్ తన పాదయాత్రలో శ్రీకాకుళానికి రాకుండానే ప్యాకప్ చెప్పేశారని, ఇప్పుడు ఖాళీగా ఉండి ట్వీట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 70 రోజుల్లో ఎవరు ప్యాకప్ చెపుతారో తెలుస్తుందన్నారు. ప్రతిపక్షాలకు అధికారం కావాలి.. తమకు ప్రజల సంక్షేమం కావాలని స్పష్టం చేశారు.

శ్రీకాకుళంలో గురువారం ఆయన మీడియాతో బొత్స మాట్లాడుతూ… రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల్లో అర్హులైనవారందరికీ నవరత్నాల పథకాలు అమలు చేసి వారి జీవన ప్రమాణాలు పెంచినందుకు జగన్‌ని వద్దనుకుంటారా అని బొత్స నిలదీశారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచినందుకా? ఉత్తమ విద్యావిధానాన్ని రూపొందించి వారి పిల్లల‌ను చదివించినందుకా? ప్రజలకు కార్పొరేట్‌ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నందుకా? రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నందుకా? వారికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటున్నందుకా? అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో చేసిన మోసాలను, ప్రజలను ఇబ్బందులు పెట్టిన తీరును జనం మరిచిపోలేదని తెలిపారు. యావత్‌ భారతదేశం ఆంధ్రాలో అమలు చేస్తున్న పథకాలను ఆసక్తిగా గమనిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. నాణ్యమైన, చిత్తశుద్ధితో కూడిన పాలన అందిస్తున్నాం కాబట్టే దేశమంతా తమను గుర్తిస్తోందని తెలిపారు.