త్వరలో మినీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాబోతున్నాయి

ఇప్పటీకే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుండగా..ఇక ఇప్పుడు మినీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను పెంచడం, జలంధర్‌తో లూథియానా లేదా కోయంబత్తూర్ వంటి టైర్-టూ నగరాలను మధురైతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో 8 కోచ్‌లతో మినీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. త్వరలో వాటిని పట్టాలెక్కించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో దీని కోసం ఒక నమూనా తయారు చేస్తోంది. సీటింగ్ అమరికతో కూడిన మినీ-వందే భారత్ ఎక్స్‌ప్రెస్ డిజైన్ దాదాపుగా ఫైనల్ అయినందున అటువంటి ఎనిమిది కోచ్‌ల వందే భారత్ ఈ ఏడాది మార్చి-చివరిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె ప్రయాణికుల కోసం త్వరలో మరో మూడు వందే భారత్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఏయే మార్గాల్లో అందుబాటులోకి తీసుకురావాలనే విషయంపై అధికారులు కూడా ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండో విడతలో కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-పూణె, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. వందే భారత్ రైళ్ల కోసం డిపోల ఎంపిక, నిర్వహణ కోసం మెకానికల్ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు దృష్టి సారించారు.