సింగాపురం కేసీఆర్ కు, నాకు ఆతిథ్యమిచ్చింది: హరీశ్ రావు

సింగాపురం గ్రామంలో హరీశ్ రావు ఎన్నికల ప్రచారం

హైదరాబాద్ : హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఎల్లుండితో ప్రచారం ముగియనుంది. గత నెల రోజులుగా అన్ని పార్టీల నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో అస్త్రశస్త్రాలను సంధిస్తున్నారు. తాజాగా సింగాపురం గ్రామంలో మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ… ఆ గ్రామస్తులను సెంటిమెంటుతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ఊరు మాకు అన్నం పెట్టిందని ఆయన అన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తనకు కూడా ఆతిథ్యమిచ్చి ఆదరించిందని చెప్పారు.

ఇప్పుడు మరోసారి టీఆర్ఎస్ కు ఓటు వేసి తమను ఆశీర్వదించాలని కోరారు. సింగాపురం అంటే తనకు ఎంతో ఇష్టమని… ఈ ఎన్నికల్లో మీరు ఆశీర్వదిస్తే మరింత కష్టపడి పని చేస్తామని, మీ రుణం తీర్చుకుంటామని అన్నారు. బీజేపీ నేతలు చెప్పే మాటలను నమ్మొద్దని గ్రామస్తులను హరీశ్ కోరారు. ధరలు పెంచిన బీజేపీ మనకెందుకని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈటల చేసిందేమీ లేదని అన్నారు. దళితబంధు పథకాన్ని అమలు చేయకపోతే తన పేరును మార్చుకుంటానని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/