‘మిగ్ జాం’ తుపాను ఎఫెక్ట్…సీఎం జగన్ కీలక నిర్ణయం

మిగ్ జాం తూఫాన్ ప్రభావం ఏపీలో భారీగా ఉంది. గత మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక రహదారులు తెగిపోయాయి. చాలాచోట్ల కరెంట్ నిలిచిపోయింది. పలు ఇళ్లులు కూడా నేలమట్టం అయ్యాయి.

ఈ తరుణంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తుపాను సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన అత్యవసర పనుల కోసం జిల్లాకు రూ.2 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగించాలని, ఇందుకోసం ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

తుపాను కారణంగా వర్షాలకు ఇళ్లు, గుడిసెలు దెబ్బతింటే వారికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. సహాయక శిబిరాల్లో ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, మందులు, మంచినీరు, ఆహారం అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ రూ.1,000 లేదా కుటుంబానికి రూ.2,500 ఇవ్వాలని ఆదేశించారు. శిబిరాలకు రాకుండా ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కిలో చొప్పున ఇవ్వాలని అన్నారు. అలాగే భారీ వర్షాలతో రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా అండగా నిలబడాలని అధికారులకు నిర్దేశించారు.