కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు చూస్తున్న పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?

తెలంగాణ ఎన్నికల్లో 64 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ మూడోసారి మాత్రం ఓటమి చవిచూసింది. కేవలం 39 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినా ఎమ్మెల్యేల్లో కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో సంబంధాలు ఉండి ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలుగా గెలిచిన కొద్దిమంది ఈ లిస్టులో ఉన్నట్టు టాక్. రేవంత్ రెడ్డితో వారికి ఉన్న సంబంధాలే కారణమనే తెలుస్తున్నది. కాంగ్రెస్‌లో చేరితే నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు వస్తాయని, సొంత బిజినెస్‌కూ ఎలాంటి ఆటంకాలు ఉండవనే ఆలోచనలో ఉన్నట్టు ఆ లీకుల సారాశం. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా ఈ కేటగిరీలో ఉన్నట్టు సమాచారం. వెంటనే పార్టీ మారకుండా లోక్ సభ ఎన్నికల సమయంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం నడుస్తుంది. మరి ఎవరు పార్టీ మారతారో..ఎప్పుడు మారతారో చూడాలి.