మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉంది. బాధితులంతా తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని కో-ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్లుగా గుర్తించారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చికల్‌దరా వద్ద ఘాట్‌ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులను తెలంగాణలోని ఆదిలాబాద్‌, నల్లగొండ జిల్లాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి)కి చెందిన డ్రైవర్ షేక్ సల్మాన్, అదే గ్రామానికి చెందిన మరో యువకుడు గొల్లి వైభవ్ యాదవ్ తోపాటు అర్లి, భీంపూర్, కప్పర్ల, పెండల్‌వాడ, బేలా ప్రాంతాలకు చెందిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్లు కొటేశ్వర్, శివకృష్ణ, శ్యామ్ లింగారెడ్డి, సుమన్, యోగేశ్, హరీశ్‌లు ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలో అమరావతి జిల్లాలోని ఓ జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు.

రేపు (సోమవారం) వినాయక చవితి సెలవులు కావడంతో రెండు రోజులు వీకెండ్ విహారానికి వెళ్లారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో మహారాష్ట్రలోని అమరావతి జిల్లా కల్ దరా వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా ఘాట్ రోడ్డు కావడం.. మరోవైపు వాన కురుస్తుండటంతో చికల్ దరా ఘాట్ రోడ్డు ఎక్కే క్రమంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి 200 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన శ్యాంలింగా రెడ్డి, సుమన్, యోగేశ్, హరీశ్ లను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ తెలిపారు.