అనుమానాస్పదంగా కనిపిస్తే చితకబాదుతున్నారు

గత కొద్దీ రోజులుగా తెలంగాణ లో చిన్న పిల్లల కిడ్నాప్ సంచలనంగా మారింది. స్కూల్స్ వద్ద కొంతమంది మారువేషంలో వచ్చి..పిల్లలకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేస్తున్నారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతూ… ఉదయం పిల్లలను స్వయంగా తల్లిదండ్రులే స్కూళ్లలో దింపి.. సాయంత్రం వారే ఇంటికి తీసుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడితే చాలు జనం వారిపై దాడికి పాల్పడుతున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా..తాజాగా ములుగు జిల్లాలో అచ్చం అలాంటి ఘటనే చోటుచేసుకుంది. పట్ణణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఓ వ్యక్తిపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. తీరా అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే.. అమాయకుడని తెలిసింది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడున్న వారికి సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు.