రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్

రేపు సాయంత్రం 4.30 గంటలకు మోడీ ని కలవనున్న సీఎం

అమరావతి: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారయింది. రేపు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాని అపాయింట్ మెంట్ ఖరారయింది. రేపు సాయంత్రం 4.30 గంటలకు ఆయన ప్రధాన మంత్రి మోడీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కేంద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ప్రచారాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మోడీతో భేటీ అనంతరం… కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ దొరికితే వారిని కూడా కలిసే అవకాశం ఉంది.

దావోస్ లో పది రోజుల పర్యటనను పూర్తి చేసుకున్న జగన్ నిన్ననే రాష్ట్రానికి తిరిగొచ్చారు. ఏపీకి తిరిగి వచ్చిన వెంటనే ఆయన ప్రధాని మోడీని కలిసేందుకు వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు జిల్లా కలెక్టర్లతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ కాసేపటి క్రితం మొదలయింది. స్పందన ఫిర్యాదులతో పాటు ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణంపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేల నిర్మాణం, ఖరీఫ్ సన్నద్ధతపై కలెక్టర్లకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/