తాపాన్ని ప్రేమగా భ్రమిస్తున్నారు

‘వ్యధ’ వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం

love illusion-
love illusion-

కొందరి వ్యవహారం పరిశీలిస్తే ఉన్నత చదువులకు మానసిక వికాసానికి సంబంధం లేదనిపిస్తుంది. చదివిస్తే ఉన్నమతి పోయిందన్న సామెత కొందరికి అక్షరాల సరిపోతుంది. సామాజిక మాధ్యమాల పరిచయాలతో ప్రేమతో పడేవారు, వివేక రహితంగా తగని వ్యక్తుల ప్రేమమాయలో పడే వారిని చూస్తే ఇలాంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి.

విచ్చలవిడి తిరుగుళ్లు, వ్యామోహాలకు ప్రేమ ముసుగు తొడిగి తమకు తాము బలయ్యేవారంతా వివేకం ఎందుకు కోల్పోతున్నారో అర్థం కావడం లేదు. నా స్నేహితురాళ్లు కొందరి ప్రవర్తన చూసి బాధపడి ఇలా అంటున్నాను. నేను ఎంబిబిఎస్‌ పూర్తయిన తరువాత ఒక ఏడాది ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసి ఇప్పుడు పిజి చేస్తున్నాను.

నాతో పాటు మెడిసిన్‌ చదవిన ఒక అమ్మాయి ఆఖరు సవంత్సరంలో కొంత డిప్రెషన్‌కు గురయ్యింది. ఆ సమయంలో సామాజిక మాధ్యమాలను వ్యసనంగా మార్చుకున్నది. ఈ నేపధ్యంలో ఒక యువకుడు పరిచయం అయ్యాడు. అతను ఇంటర్‌ వరకు చదివి ఒక వర్క్‌షాపులో పనిచేస్తున్నాడు.

గతంలో ఒక అమ్మాయి ప్రేమలో పడి విఫలం చెందాడట. మాయ మాటలు చెప్పి నా స్నేహితురాలి మనసుకు దగ్గరయ్యాడు. ఆమె మెడిసిన్‌ పూర్తి చేసిన తరువాత పిజి ప్రవేశ పరీక్షలకు ప్రీపేర్‌ అవుతున్నది. అయితే అతనితో నిరంతరం ఛాటింగ్‌ చేస్తూ, ఊహాల్లో విహరిస్తూ చదువును నిర్లక్ష్యం చేసింది.

లాక్‌డౌన్‌ సమయంలో అతను ఆర్థిక కష్టాలలో వున్నాడన్న జాలితో అప్పుడప్పుడూ కలిపి 25 వేల రూపాయలు పంపింది. అతనినే పెళ్లి చేసుకోవాలనికూడా నిర్ణయించుకున్నది. అతను ఏ విధంగాను ఆమెకు సరిపోడు.

అతనిది మహారాష్ట్ర నా స్నేహితురాలిది ఆంధ్రప్రదేశ్‌. అతని వయస్సు 22 సంత్సరాలు, ఆమెకు 25 ఏళ్లు. అతను ఇంటర్‌ఫెయిలై వర్క్‌షాపులో పనిచేస్తున్నాడు. ఆమె డాక్టర్‌. ఈ విషయాలన్నీ నాతో చెప్పుకునేది. నేను ఎంత వారించినా వినేదికాదు. ఆమె దారి తప్పుతున్నదని గ్రహించి ఈ విషయం రహాస్యంగా వారి తల్లిదండ్రులకు చెప్పాను.

వారు ఫోన్‌ కాల్‌ డేటా,బ్రాంక్‌ లావాదేవీలు పరిశీలించి ఆమెను నిలదీవారు. ఆమె అన్నింటికి ఒప్పుకున్నది. అయితే తాను మేజర్‌నని, తన పెళ్ల తనిష్టమని తల్లి తండ్రులపై తిరగబడింది. ఆఖరికి వారు కటువుగా వ్యవహరించి సెల్‌ఫోన్‌ లాక్కుని గృహనిర్భంధం చేశారు తరువాత సైకాలజిస్టు ద్వారా కౌన్సెలింగ్‌ చేయిస్తున్నారు.

అలాగే మాతో పాటు మెడిసిన్‌ చదివిన మరొక అమ్మాయి తమ ఇంట్లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తితో ప్రేమలో పడింది. రహస్యంగా వారిద్దరూ కలసి తీరుగుతారు, శారీరక సంబంధాలు సాగాయి. పెద్దవారికి తెలిసి గొడవజరగడంతో తట్టుకోలేక ఆత్మహత్యాప్రయత్నం చేసింది. అమ్మాయి తల్లితండ్రులకు డబ్బు పలుకుబడి వున్నందున డ్రైవర్‌ను ఆమెకు దూరంగా పంపేశారు.

ఇప్పుడు ఆమె పిచ్చిదానిలా మారిపోయింది. అతను లేనిదే జీవితం లేదన్నట్టు వ్యవహరిస్తోంది. ఒక్కోసారి విపరీతంగా ప్రవర్తిస్తుందటంతో సైకియాలిస్టు ద్వారా చికిత్స చేయిస్తున్నారు.

మా ప్రక్కఇంటిలోని ఒకామె ఎంబిఎ చదివి ఓ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి ఇంటిపై పోర్షన్‌లో అద్దెకు ఉన్న ఒక యువకునితో వివాహేతర బంధం ఏర్పరచు కున్నది. ఇటీవల అతనితో కలసి ఎక్కడికో వెళ్లిపోయింది. అతని తల్లితండ్రులకు విషయం తెలిసి, ఆమె భర్తకు చెప్పి అందరు కలసి పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు గాలించి వారిద్దరిని పట్టుకుని తీసుకవచ్చి కౌన్సెలింగ్‌ చేసి పంపారు. అయినా ఆమెలో మార్పురాలేదు. పిల్లలకోసం భర్త ఆమెను సహిస్తున్నప్పటికీ ఆమె ప్రియునికోసం తపిస్తోంది. ఇలాంటి సంఘటనలు చూసిన తరువాత విద్య వల్ల ఎందుకు వివేకం కలగడం లేదనిపిస్తోంది. దీనికి కారణాలు విశ్లేషించి, పరిష్కార మార్గాలు సూచించగలరు.

  • ప్రభావతి, కాకినాడ

అమ్మా, మీ ప్రశ్నలు సహేతుకంగానే ఉన్నాయి. చదువు, సంస్కారం, విద్య- వివేకం, జ్ఞానం-వికాసం, చదువు తెలివితేటల మధ్య సంబంధం వున్నప్పటికీ, ఒకదాని వల్ల మరొకటి తప్పకుండా వస్తుదని చెప్పలేము. చదువు వల్ల విషయ పరిజ్ఞానం వస్తుంది.

అయితే పూర్తిస్థాయి లోకజ్ఞానం వస్తుందని చెప్పలేము. అలాగే సంస్కరాలు అబ్బుతాయన్న గ్యారెంటీ లేదు. అలాగే మన చదువువల్ల వ్యక్తిత్వం మారుతుందనీ చెప్పలేము.

అయితే వీటన్నిటి ప్రభావం వ్యక్తి నిర్మాణంలో ఉంటుందన్న విషయం కాదనలేము. ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, ప్రవర్తన, వ్యవహారశైలి అనేక అంశాలపై ఆధారపడి వుంటుంది.

వంశానుగతర, జన్యువులు, పెంపకం, పరిసరాలు, అను భవాలు, ఆశలు, కోర్కెలు, హార్మోన్లు, పరిస్థితులు, మీడియా తదితర అంశాలు మనిషిని ప్రభావితం చేస్తుంటాయి. అలాగే జీవితం పట్ల వారు ఏర్పరచుకున్న లక్ష్యాలు, ఎంచుకున్న మార్గాలు ప్రేరకాలుగా పనిచేస్తాయి. శరీరంలో ఉత్పత్తి అయ్యే రసాయనాలు ఒక్కోసారి మనిషి ఆలోచనల్ని గతి తప్పించి, వక్రమార్గాలను పట్టిస్తాయి. అందుకే మన సమాజంలో అనేక పద్ధతులు, నమ్మకాలు, విశ్వాసాలు, ఆచారాలు, ధర్మాలు ఏర్పడ్డాయి.

ఇవన్నీ మనిషి ఆలోచన ప్రవర్తనను కొంతవరకు నియంత్రిస్తుంటాయి. అయితే పరిసరాలు, హార్మోన్ల ప్రభావం వల్ల కొందరు ధర్మాలను అతిక్రమించి ప్రవర్తిస్తుంటారు. అందుకే పిల్లల పెంపకం పట్ల శ్రద్ద చూపాలంటాము.

కుటుంబం, విద్యాసంస్థలు బాల్యం నుంచే విద్యతోపాటు విలువలు, వివేకం వికాసం, లోకజ్ఞానం కల్పించాలని సామాజిక వేత్తలు అంటున్నారు. ఇప్పటి పరిస్థితు లలో మనం వాటిని విస్మరించి మార్కులు, ర్యాంకులు, ఉద్యోగం సంపాదనకే పరిమితమవుతున్నందున ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి.

కాగా మీ స్నేహితురాళ్లు ముగ్గురిలోను హార్మోన్ల ప్రభావం, ప్రవర్తనా లోపాలు ఉన్నాయని భావించాల్సి ఉంది. వారు ముగ్గురూ వ్యామోహం, కోర్కెల తాపాన్ని ప్రేమగా భ్రమిస్తున్నారు.

వారిని అనునయంతో దగ్గరకు తీసి, ఆదరించి సహానుభూతితో వివేకం కల్పిస్తే తప్పకుండా మారుతారు. అనుభవం ఉన్న సైకాలజీస్టుల ద్వారా కౌన్సెలింగ్‌ చేయిస్తే సరిపోతుంది.

-డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/