45 రోజులు పూర్తి చేసుకున్న లోకేష్ యువగళం యాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 45 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 45 రోజుల్లో లోకేష్ 577 కిలోమీటర్లు నడిచారు.జనవరి 27వ తేదీన కుప్పంలో ప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. లోకేష్ యాత్ర కు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు. లోకేష్ సైతం ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ, అధికార పార్టీ ఫై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేశ్ సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రతి వంద కిలోమీటర్ల మజిలీలో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ… తాము అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో సంబంధిత అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటిస్తున్నారు. 39వ రోజు మదనపల్లి శివారు చినతిప్పసముద్రంలో పాదయాత్ర 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా, అధికారంలోకి వస్తే మదనపల్లిలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

అలాగే యాత్రలో అనేక హామీలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు వైసీపీ ప్రభుత్వం 24శాతానికి తగ్గించిన రిజర్వేషన్లు మళ్లీ 34 శాతానికి పెంపు, బీసీల రక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీ రక్షణ చట్టం. దామాషా పద్దతిలో బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు కేటాయింపు. బీసీ విద్యార్థులకు విదేశీ విద్య పథకం అమలు. స్థానిక సంస్థల్లో జగన్ తగ్గించిన 10 శాతం రిజర్వేషన్లు తిరిగి పెంచుతాం. వడ్డెర్ల వృత్తి పని కోసం క్వారీల కేటాయింపు. సత్యపాల్ నివేదిక మేరకు వడ్డెరలను ఎస్టీల్లో చేర్చే అవకాశం పరిశీలిస్తాం. తిరుమలలో రజకులకు బట్టలు ఉతికే కాంట్రాక్ట్. రజకుల దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ వంటి ప్రకటించారు.