ఉద్యోగుల పట్ల ఎందుకంత క్రూరత్వం : జగన్ కు లోకేశ్ లేఖ

ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్

అమరావతి: టీచర్లు, ఉద్యోగులను అరెస్టు చేయడం, నిర్బంధించడం పట్ల ఏపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ మండిపడ్డారు. దీనిపై సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగుల పట్ల ఎందుకంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారని నిలదీశారు. వారికి న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం శాంతియుతంగా నిరసన తెలియజేయడం నేరమా? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కును హరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు నేర్పే గురువులను పోలీసులతో నిర్బధించడమేనా వారికిచ్చే గౌరవమంటూ ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉద్యోగులు భాగం అంటూనే.. సలహాదారులు, తాబేదారులు, పోలీసులతో మాటలు, విష ప్రచారాలు, దాడులు చేయిస్తూ మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం రాక్షస ప్రవృత్తి? అంటూ సీఎం జగన్ ను నిలదీశారు. వారంలో సీపీఎస్ ను రద్దు చేస్తామని చెప్పి.. ఇప్పుడు అవగాహన లేక అలా చెప్పామంటూ మడమ తిప్పారని మండిపడ్డారు. రివర్స్ పీఆర్సీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు.

ఎలాంటి గౌరవం దక్కకపోయినా.. కుటుంబాన్ని వదిలి మరీ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులంటే ఎందుకింత కక్ష? అని లోకేశ్ మండిపడ్డారు. ఇచ్చిన మాట తప్పబోమంటూ బీరాలు పలికింది మీరే కదా? అని జగన్ ను ప్రశ్నించారు. ‘‘ఉద్యోగులేం మీ లక్షల కోట్ల అక్రమాస్తుల్లో.. మీ అక్రమాల పుత్రిక సాక్షిలో.. మీ ఇంద్ర భవనాల్లో వాటాలు అడగడం లేదు. న్యాయంగా వారికి రావాల్సిన ప్రయోజనాలు, మీరిచ్చిన హామీలను అమలు చేయాలనే అడుగుతున్నారు. దాని ప్రకారం ఇస్తామన్నవన్నీ ఉద్యోగులకు ఇవ్వండి’’ అంటూ డిమాండ్ చేశారు. వీటన్నింటినీ భరిస్తూ న్యాయం చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు వేడుకుంటున్నా తన ఇష్టం అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. డిమాండ్లను నెరవేర్చాలంటూ రోడ్డెక్కితే పోలీసుల్ని ఉసిగొల్పి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. ఉద్యోగుల శాంతియుతమైన ఉద్యమానికి తాము సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్టు లోకేశ్ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/