ఆగస్టులో చంద్రయాన్ 3 ప్రయోగం..కేంద్రం

లోక్ సభలో లిఖిత పూర్వక సమాధానం

న్యూఢిల్లీ : చంద్రయాన్ 2తో చందమామపై దిగాలన్న భారత్ కల కల్లలై దాదాపు రెండేళ్లయిపోతోంది. జాబిల్లిపై భారత సంతకం ఉంటుందని సంబరపడిపోయిన ప్రతి భారతీయుడి ఆశ చెదిరిపోయింది. అయితే, ఇప్పుడు ఆ నిరాశ నుంచి రెట్టింపు ఆశలతో మరో చందమామ ప్రయోగానికి భారత్ సిద్ధమవుతోంది. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఈ ఏడాదే చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది ఆగస్టులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్ 3 ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఈ విషయాన్ని అంతరిక్ష ప్రయోగాల శాఖ (స్పేస్ డిపార్ట్ మెంట్) వెల్లడించింది. చందమామ ప్రయోగం, ఆ ప్రయోగం ఆలస్యం కావడంపై లోక్ సభలో అడిగిన ప్రశ్నలకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. చంద్రయాన్ 2 వైఫల్యం నేర్పిన పాఠాలు, అంతర్జాతీయ నిపుణుల సలహాలను తీసుకుంటూ చంద్రయాన్ 3 మిషన్ ను అభివృద్ధి చే స్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే దానికి అవసరమైన పరీక్షలన్నీ పూర్తయ్యాయని తెలిపారు.

కరోనా మహమ్మారి వల్ల షెడ్యూల్ లో పెట్టిన ప్రయోగాలే ఆలస్యమవుతున్నాయని చెప్పారు. అయితే, ప్రస్తుతం డిమాండ్ ప్రాతిపదికన ప్రయోగాలకు ప్రాధాన్యక్రమాన్ని పునర్నిర్వచిస్తామని చెప్పారు. 2008 అక్టోబర్ లో ప్రయోగించిన చంద్రయాన్ మిషన్ ద్వారా తెలిసిన విషయాల ఆధారంగా చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేయబోతున్నట్టు తెలిపారు. వాస్తవానికి గత ఏడాదే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. రెండేళ్ల క్రితం చేపట్టిన చంద్రయాన్ 2 విఫలం అయిన సంగతి తెలిసిందే. మిషన్ లో భాగంగా ల్యాండర్ ‘విక్రమ్’, రోవర్ ‘ప్రజ్ఞాన్’, ఆర్బిటర్ లను చంద్రుడికి దగ్గరగా పంపించారు. మిషన్ అంతా సాఫీగానే సాగినా.. 2019 సెప్టెంబర్ 6న చంద్రుడిపై ల్యాండ్ అయ్యే సమయానికి ‘విక్రమ్’ క్రాష్ ల్యాండ్ అయింది. ప్రస్తుతం ఆర్బిటర్ జాబిలి చుట్టూ చక్కర్లు కొడుతోంది.

కాగా, ఈ ఏడాది ఇస్రో మొత్తంగా 19 ప్రయోగాలు చేపట్టనున్నట్టు జితేంద్ర సింగ్ వెల్లడించారు. 8 రాకెట్ ప్రయోగాలు, 7 స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగాలు, 4 టెక్నాలజీ డిమాన్ స్ట్రేషన్ ప్రయోగాలను చేపడతారని తెలిపారు. ఈ ఏడాది తొలి ప్రయోగం వాలెంటైన్స్ డే నాడు జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. భూ పరిశీలనా ఉపగ్రహం అయిన రిశాట్ (రాడార్ ఇమేజింగ్ శాటిలైట్) 1ఏని పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగిస్తారని అంటున్నారు. దానిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రిశాట్ 1ఏ ఉపగ్రహాన్ని నిమ్న భూ కక్ష్యలో 500 కిలోమీటర్ల ఎత్తులోకి పంపిస్తారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/