మరి జగన్ డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారు?: లోకేశ్

lokesh-comments-on-jagan

అమరావతిః ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడుకెక్కుతున్నాయి. అధికార వైఎస్‌ఆర్‌సిపి, ప్రతిపక్ష టిడిపి నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాజకీయం రంజుగా మారుతోంది. దీనికితోడు ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టేందుకు సిద్ధం చేసిన తాయిలలు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. తాజాగా, రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చెందిన గోడౌన్‌లో పంపకానికి సిద్దంగా ఉన్న చేతిగడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతోపాటు మొత్తంగా 52 రకాల వస్తువులను అధికారులుపట్టుకున్నారు.

దీనిపై టిడిపి అగ్రనేత నారా లోకేశ్ స్పందించారు. ఐదేళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన జనం జగన్‌ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో బంధించాలన్న నిర్ణయానికి వచ్చారని ఎక్స్ చేశారు. విషయం తెలిసిన జగన్ చీప్ ట్రిక్స్‌తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారని, అది సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేణిగుంటలో చెవిరెడ్డి సిద్ధం చేసిన డంప్‌ను అధికారులు పట్టుకున్నారని తెలిపారు. టిడిసి ఫిర్యాదు చేస్తే వైఎస్‌ఆర్‌సిపి తాయిలాల డంప్‌ను పట్టుకున్నారని, మరి ఇసుక, లిక్కర్‌లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధంచేసిన డబ్బుల డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా ప్రజల ఆగ్రహజ్వాలలను అడ్డుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గుర్తించాలని లోకేశ్ సూచించారు.