కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కడియం కావ్య

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో పాటు ఆయన కూతురు కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్యలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన కూతురు భవిష్యత్తు కొరకై బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరినట్లు కడియం ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ ఉంది .ఈమేరకు ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యే కడియంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రస్థానంలో తాను ఒక్క తప్పు కూడా చేయలేదని, ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, రియల్‌ ఎస్టేట్‌, భూ కబ్జాలు చేయలేదని, ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టుకోలేదని కడియం అన్నారు. తనను విమర్శించే నైతిక అర్హత ఏ ఒక్కరికీ లేదన్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఒక్క కేసు కూడా లేదన్నారు. చాలా మంది పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టుకున్నారని తెలిపారు. తనను ఆశీర్వదించినట్లే తన కుమార్తెనూ ఆశీర్వదించాలని నేతలను కడియం శ్రీహరి కోరారు.