రాహుల్ అన‌ర్హ‌త వేటు కేసు..ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు

Defamation case. Supreme Court issues notice to Purnesh Modi, Gujarat govt on Rahul Gandhi’s appeal against HC verdict

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ మోదీ ఇంటి పేరు పై చేసిన వ్యాఖ్య‌ల‌కు గుజ‌రాత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో ఈరోజు సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. గుజ‌రాత్ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాల‌ని రాహుల్ వేసిన పిటీష‌న్‌పై స్పందిస్తూ పూర్ణేశ్ ఈశ్వ‌ర్‌భాయ్‌ మోదీతో పాటు గుజ‌రాత్ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, ప్ర‌శాంత్ కుమార్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసులో మ‌ళ్లీ ఆగ‌స్టు 4వ తేదీన విచార‌ణ ఉంటుంద‌ని సుప్రీం తెలిపింది. రెండు వారాల్లోగా కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కోర్టు సూచించింది.

జ‌స్టిస్ గ‌వాయి ఈ కేసు విచార‌ణ నుంచి త‌ప్పుకోవాల‌ని భావించారు. త‌న తండ్రి, సోద‌రుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నార‌ని, కావాలంటే తాను ఈ కేసు నుంచి త‌ప్పుకుంటాన‌ని, దీనిపై మీరు ఎటువంటి నిర్ణ‌యాన్ని అయినా తీసుకోవ‌చ్చు అని జ‌స్టిస్ గ‌వాయి తెలిపారు. అయితే ఈ కేసులో విచార‌ణ చేప‌ట్టేందుకు త‌మ‌కు ఎటువంటి అభ్యంత‌రం లేద‌ని న్యాయ‌వాది సింఘ్వీ తెలిపారు. ఆ త‌ర్వాత బెంచ్ నోటీసులు జారీ చేసింది.

రాహుల్ గాంధీ త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది అభిషేక్ మ‌నూ సింఘ్వీ వాదిస్తున్నారు. రాహుల్‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వాల‌ని ఆయ‌న త‌న పిటీష‌న్‌లో కోరారు. 111 రోజుల నుంచి మా పిటీష‌న‌ర్ వేద‌న‌కు గుర‌వుతున్నాడ‌ని, ఇప్ప‌టికే ఓ పార్ల‌మెంట్ సెష‌న్ కోల్పోయార‌ని, ఇప్పుడు మ‌రో సెష‌న్‌ను కూడా మిస్ అవుతున్నార‌ని న్యాయ‌వాది తెలిపారు. వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారని, అయితే అన‌ర్హ‌త వేటును ర‌ద్దు చేస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని సింఘ్వీ కోరారు.

అయితే ఈ కేసులో ప్ర‌తివాదులుగా ఉన్న పూర్ణేశ్ మోదీ, గుజ‌రాత్ స‌ర్కార్ నుంచి వాద‌న‌లు వినాల్సి ఉంద‌ని కోర్టు తెలిపింది. స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాక‌రించింది. గుజ‌రాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వంద పేజీలు ఉంద‌ని, దాన్ని స్ట‌డీ చేసేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని సుప్రీం తెలిపింది. 2019 ఎన్నిక‌ల ర్యాలీలో క‌ర్నాట‌క‌లోని కొలార్‌లో రాహుల్ మాట్లాడుతూ మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్య‌లు చేశారు. ఆ కేసులో ఈ ఏడాది మార్చి 23వ తేదీన సూర‌త్ మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు ప్ర‌క‌టించింది. దీంతో ఆయ‌న త‌న పార్ల‌మెంట్ అభ్య‌ర్ధిత్వాన్ని కోల్పోయారు.