బ్రేకింగ్: తెలంగాణలో రేపటి నుండి లాక్‌డౌన్

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పుడే ఆదేశాలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభన దేశవ్యాప్తంగా భయాందోళన పరిస్థితులను సృష్టిస్తుండటంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను విధించుకున్నాయి. అయితే తెలంగాణలోనూ కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధించింది. కానీ కేసుల సంఖ్యలో ఎలాంటి తగ్గుముఖం లేకపోవడంతో కాసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ సమావేశం అయ్యింది.

కరోనా కట్టడికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మే 12 ఉదయం 10 గంటల నుండి పది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు లాక్‌డౌన్ నుండి మినహాయింపును ఇస్తున్నట్లు, ప్రభుత్వం తెలిపింది. ఈ సమయంలో ప్రజలు నిత్యావసరాల కొనుగోళ్లు చేసుకోవచ్చని కేబినెట్ నిర్ణయించింది.

అయితే లాక్‌డౌన్‌కు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రస్తుతం కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో గతంలో అమలు చేసిన మార్గదర్శకాలనే ఈసారి కూడా అమలు చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరి రంజాన్ పర్వదినం పండుగ ఉండటంతో, ఏదైనా మినహాయింపు ఇస్తారో లేదో అనేది ఆసక్తికరంగా మారింది.