శ్మశానాల్లోనూ టోకెన్ సిస్టమ్.. ఎక్కడంటే?

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా మారిపోయాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. జనాలు తమ తోటివారి పట్ల సానుభూతిని చూపుతూ తమకు తోచిన సాయం చేస్తూ మానత్వం చాటుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో ఇతరులకు సాయం చేసే అవకాశం కూడా లేకుండా పోతుంది. దీంతో కరోనా బాధితులు, మృత్యువాత పడ్డవారి బంధువులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా కరోనాతో మృతిచెందిన వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కరోనాతో చనిపోయిన వారి అంతిమ సంస్కారాలు కూడా సరిగా జరగడం లేదు. కరోనాతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో శ్మశానాల్లో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా శ్మశానవాటికల్లో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేయడం ఆలస్యంగా మారుతుండటంతో కొన్ని చోట్ల టోకెన్ సిస్టమ్ పెట్టి మరీ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని బీసెంట్‌ నగర్‌, వెలంగోడు, అరుంబాక్కం, విల్లివాక్కం తదితర శ్మశానవాటికలకు కరోనా మృతుల మృతదేహాలు పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతున్నాయి.

దీంతో అక్కడ శ్మశాన పనివేళలను ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు కాకుండా 24 గంటలు ఉండేలా చూడాలని స్థానిక అధికారులను అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఏదేమైనా శ్మశానవాటికల్లో కూడా టోకెన్ సిస్టమ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, అక్కడ ఎలాంటి భయందోళన వాతావరణం నెలకొందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.