వర్తమానంలో జీవించాలి


మేడమ్‌! నా పేరు కమల. నా వయసు 45 సంవత్సరాలు. నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త ఇల్లు వదిలి కాశీ వెళ్లిపోయారు. యోగిగా మారతానని చెప్తూ ఉండేవారు. వదిలి వెళ్లి మూడు సంవత్సరాలైంది. ఈ విషయమై నాకు చాలా కుంగుబాటుగా ఉంది. ఏం చెయ్యాలి? ఏం చేస్తే నాకు ఈ బాధలు తొలగిపోతాయి. – కమల
మీరు తప్పక ఆనందంగా ఉండగలరు. కొంచెం కృషి చేయవలసి ఉంటుంది అంతే. మీరు ధైర్యంగా ఉండాలి. స్వశక్తి మీద నిలబడగలగాలి. ఆత్మ విశ్వాసంతో ఏ పనైనా చక్కగా చేయగలరు. మీ కాళ్ల మీద మీరు నిలబడాలి. మీ భర్త అతనిష్టమైన దారిని ఎంచుకొన్నారు. మీరు దాని గురించి చింతించవద్దు. చింతించినా లాభం లేదు. అతను తిరిగి రాకపోవచ్చు. మీరు మీ పిల్లలకి అండగా నిలవాలి. వారికి ధైర్యం చెప్పాలి. వారి అవసరాలను తీర్చాలి. ఇవన్నీ చెయ్యాలంటే చాలా ఆత్మ విశ్వాసం, ఆత్మస్థయిర్యం కావాలి. అందువల్ల మీరు తప్పక ధైర్యంగా ఉండాలి. జీవితం అమూల్యమైన కానుక. దైవసంబంధమైన అనుభూతి. దానిని సద్వినియోగం చేసుకోవాలి. వర్తమానంలో జీవించాలి. ఆందోళన వద్దు. మంచి బోధకుల, గురువ్ఞలు బోధనల ద్వారా ఆత్మసంతృప్తి పొందవచ్చు. సానుకూలంగా ఆలోచించాలి. వ్యతిరేక ఆలోచనల వల్ల ఆరోగ్యం పాడయిపోతుంది. జీవించినంతకాలం ఆనందంగా గడపాలి. ఒత్తిడి, కుంగుబాటు దరిచేరనీయవద్దు. మంచి కాలక్షేపం చేస్తూ, మీరు ఆనందించే పనులు చేస్తూ, ఆనందంగా సమయాన్ని గడపాలి. ఇది తప్పనిసరి. కౌన్సిలింగ్‌ తీసుకోవచ్చు. వృత్తి నిపుణుల సలహాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. మీరు స్వయం ఆధారిత చికిత్సల ద్వారా మరల ఉత్సాహకరమైన జీవితాన్ని పొందవచ్చు. ఏది ఏమైనా గృహ వాతావరణం ఆనందంగా ఉంచుకోవాల్సిందే. ప్రతిరోజూ పండుగలాగా జరుపుకోవాల్సిందే.
ఆందోళనతో కుంగిపోవద్దు
మేడమ్‌! నా పేరు అనిత. నా వయసు 35 సంవత్సరాలు. మాది గుంటూరు. ఈ మధ్యనే మా ఇంట్లోనే మా బంధువ్ఞ చనిపోయారు. ఆయన మాకు చాలా దగ్గర బంధువ్ఞ. చాలా ఆత్మీయుడు కూడా. అతని మరణాన్ని చాలా దగ్గరగా చూసాను. అది చూసి నేను చాలా కుంగిపోయాను. అంతేకాక, మా బంధువ్ఞల వివిధ రకాల ఆరోపణల ద్వారా కూడా చాలా కుంగిపోయాను. దీని నుంచి నేను బయట పడేదెలా? మరల తిరిగి మామూలు మనిషి అయ్యేదెలా? ప్లీజ్‌ కొంచెం వివరించండి. – అనిత
మీరు తప్పక మరల మామూలు మనిషి కాగలరు. ఎవరికైనా మరణం సహజం. అందువల్ల దాని గురించి కుంగిపోవద్దు. ఈ బాధల నుండి మీరు బయట పడాలంటే, మీరు మిమ్మల్ని ఆనందంగా ఉంచుకోవాలి. మీకిష్టమైన పనుల్ని మీరు చేసుకోవాలి. మంచి పుస్తకాలు చదవవచ్చు. మంచి సినిమాలు చూడవచ్చు. మంచి సేవా కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. అంటే మీకిష్టమైన ఆనందపరిచే పనులు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు బాగా చూచుకోవాలి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. దుఃఖాన్ని, ఆందోళన దూరంగా ఉంచాలి. ఇదంతా ప్రయత్నపూర్వకంగా జరగాలి. మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచేలా కృషి చేయాలి. ఇది తప్పని సరి. వ్యతిరేకమైన ఆందోళనల వల్ల మీ ఆరోగ్యం పాడయిపోతుంది. కుంగుబాటు వల్ల, నిరాశ, నిస్పృహలు వచ్చేస్తాయి. అందువల్ల మీరు తప్పక సానుకూలంగా ఆలోచించాలి. మంచి అనుభూతులను పొందాలి. ఉత్సాహంతో ఎల్లప్పుడూ ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి. స్నేహితులతో మాట్లాడాలి. ఆత్మీయులతో కలసి ఉండాలి. స్వాంతన పొందాలి. కౌన్సిలింగ్‌ తీసుకోవాలి. ఏది ఏమైనా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా కృషి చెయ్యాలి. జీవితం ఒక అమూల్యమైన వరం. దానిని తప్పక ఆనందంగా స్వీకరించాలి.
-డాక్టర్‌. ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/