కేటీఆర్ ఆ ఒక్క మాట చెప్పి అందరి హృదయాలను కట్టిపడేసాడు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ‘సీఎం అల్పాహార పథకం’ ను ఘనంగా ప్రారంభించారు. పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు , మంత్రులు ఈ పధకాన్ని ప్రారంబించారు. సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. వారితో కలిసి కూర్చుని తింటూ సరదాగా కబుర్లు చెప్పారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థులు అటుగా వెళ్తుంటే.. తన వద్దకు పిలుచుకున్నారు మంత్రి కేటీఆర్. ఆ అబ్బాయిల పేర్లు, ఇతర వివరాలు అన్నీ అడిగారు. అదే సమయంలో తల్లిదండ్రులు ఏం చేస్తారని ప్రశ్నించగా.. తండ్రి జాబ్ చేస్తారని, అమ్మ ఏమీ చేయదని స్టూడెంట్ బదులిచ్చాడు. దానికి మంత్రి ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరినీ హత్తుకుంటుంది.

పిల్లలను మీ అమ్మగారు ఏం చేస్తారని ప్రశ్నించగా.. ఏమీ చేయదని బదులిచ్చారు. దాంతో ఇంకెప్పుడు అలా అనకండి అంటూ పిల్లలకు సూచించారు మంత్రి కేటీఆర్. ‘అమ్మను హౌస్ వైఫ్ అని ఎప్పుడూ అనకండి. అమ్మ మీ అందరినీ నడిపిస్తుంది. అసలు మీరందరూ బాగున్నారంటే దానికి కారణం అమ్మ. అమ్మ ఏమీ చేయదని ఎప్పుడు చెప్పకండి.’ అంటూ విద్యార్థులకు చెప్పారు మంత్రి కేటీఆర్. పిల్లలు, మంత్రి కేటీఆర్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.