రేపు ‘సిద్దిపేట ఐటీ హబ్’ ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావు

సిద్ధిపేట శివారులో నిర్మిస్తున్న ఐటీ హబ్‎ ను రేపు మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు లు ప్రారభించనున్నారు. రాష్ట్రంలో ఐటీని విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం పలు నగరాల్లో ఐటీ టవర్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, ఖమ్మం వంటి నగరాల్లో ఐటీ హబ్​లు నిర్మించి.. అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక తాజాగా నిజామాబాద్, నల్గొండ, సిద్దిపేటలో ఐటీ హబ్​ల నిర్మాణం జరుగుతోంది.

ఈ క్రమంలోనే ఈనెల 15వ తేదీన సిద్దిపేట ఐటీ హబ్​ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్‌ రహదారిని ఆనుకొని నిర్మించిన ఐటీ టవర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ టవర్‌ను పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావుతో కలిసి గురువారం ప్రారంభించనున్నారు. 3 ఎకరాల సువిశాల స్థలంలో రూ.63 కోట్లతో జీప్లస్‌ 4 అంతస్తుల్లో ఐటీ టవర్‌ను నిర్మించారు.

ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..ఐటీ హబ్‎లో ప్రత్యక్షంగా 750 మంది స్థానిక యువతకు, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. టాస్క్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతీ 45 రోజులకు ఒకసారి ప్రారంభమయ్యే బ్యాచ్‎లో 150 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.