బండి సంజయ్ తెలివి లేని దద్దమ్మ అంటూ కేటీఆర్ ఫైర్

TSPSC పేపర్ లీకేజ్ ఘటన ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేస్తుంది. ప్రతి పక్షపార్టీలు , విద్యార్థి సంఘాలు ఆందోళల బాట పట్టాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే టీఎస్ పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ జరిగిందంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ ధనాపేక్ష వల్ల లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలు ఆగమయ్యాయని విమర్శించారు. పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారించడంతో పాటు కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

బండి సంజయ్ వ్యాఖ్యల ఫై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. TSPSC అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమనే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్ మహా అజ్ఞాని అని తేలిపోయిందన్నారు. ప్రభుత్వ వ్యవస్ధల పనితీరు, వాటి పరిధుల గురించి అవగాహన లేకుండా, బండి సంజయ్ ఎంపీ ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలపై కనీస పరిజ్ఞానం, వాటి మధ్య ఉన్న తేడా తెలియ‌కుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దిగజారుడు వాదనలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలోనే 8 సంవత్సరాలలో 13 సార్లు జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలపై ఏమంటావని బండి సంజయ్‌ని సూటిగా నిలదీశారు.

మరి ఈ పేపర్ లీకేజీల పైన ప్రధాని మోడీ ని బాధ్యున్ని చేసి ఆయన రాజీనామాను డిమాండ్ చేయాలని సవాల్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్వశ్చన్ పేపర్లు లీకైతే.. తిరిగి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయని అన్నారు. అక్కడ పేపర్లు లీకైనప్పుడు మంత్రిని కానీ.. లేక అక్కడి ముఖ్యమంత్రిని కానీ.. ఏనాడు బీజేపీ బాధ్యులను చేయలేదని గుర్తుచేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రభుత్వం మెరుపువేగంతో సిట్‌ను నియమించి.. బాధ్యులైన వారందరినీ అరెస్టు చేసిందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదని గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేయాలని కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఇది బాధాకరమైన నిర్ణయం అయినప్పటికీ తప్పలేదని.. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఒకవైపు ప్రభుత్వం స్పందించిన పారదర్శక తీరును పట్టించుకోకుండా కేవలం మొత్తం వ్యవహారాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని దుర్మార్గమైన ప్రయత్నాన్ని బీజేపీ మానుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు.