ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట గ్రూప్ 1 ప్రిలిమ్స్ అభ్యర్థుల నిరసన

ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల నేపథ్యంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. తిరిగి జూన్ 11న ప్రిలిమినరీ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనిపట్ల గ్రూప్ -1 ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న తమకు టీఎస్పీఎస్సీ (TSPSC) అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. జూన్ లో నిర్వహిస్తామన్న పరీక్షను టీఎస్పీఎస్సీకి కాకుండా యూపీఎస్సీ(UPSC)కి అప్పగించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ , న్యాయం జరుగకుంటే ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హాచ్చరిస్తున్నారు.

మరోపక్క పేపర్​ లీక్​ ఘటనలో ప్రవీణ్ ​సహా మరో ఎనిమిది మంది నిందితులపై కేసులు నమోదయ్యాయి. మొత్తం తొమ్మిది మంది నిందితులకు మరో ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. నిందితులను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కు స్పందించిన కోర్టు 6 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. నిందితులను రేపటి (మార్చి 18) నుంచి మార్చి 23 వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు.