ప్రతీకార రాజకీయాలు చేసుంటే రేవంత్‌ ఎప్పుడో జైలుకు వెళ్ళేవాడు – కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండడం తో అన్ని రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. ఇరు నేతలు ఒకరి ఫై ఒకరు విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో శనివారం బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు.

భారత దేశానికి తెలంగాణ దిక్సూచి అయిందని .. అది సీఎం కేసీఆర్‌ సాధించిన ఘనత అని పేర్కొన్నారు. నేడు తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నదని వ్యాఖ్యానించారు. తాము రాష్ట్రాన్ని అప్పులపాటు చేశారన్న ఆరోపణలు సరికాదన్నారు. అప్పులు చేసిన నిధులు సంపద సృష్టికి ఉపయోగిస్తున్నామని చెప్పారు. రుణాలను మొత్తం సాగునీటి రంగం, మిషన్‌ భగీరథకు వినియోగించామన్నారు. ఐటీ రంగంలో బెంగళూరును హైదరాబాద్‌ దాటేసిందన్నారు.

తాము ప్రతీకార రాజకీయాలు చేసుంటే రేవంత్‌ రెడ్డి ఎప్పుడో జైల్లోనే ఉండేవాడని వ్యాఖ్యానించారు. ఉన్న తెలంగాణను ఆనాడు ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఆకాంక్షను దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ అణచివేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా మోసం చేశారని.. దాంతో వందల మంది బలిదానాలు చేసుకున్నారని.. సోనియా గాంధీని బలిదేవత అని అన్నది నాడు రేవంత్‌ రెడ్డేనని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్లు బాధపడిందని కేసీఆర్ అన్నారు.