పాడెపై లేచి కూర్చున్న శవం.. పరుగులెత్తిన జనం!

కళ్ల ముందు జరిగే ఘటనలు ఒక్కోసారి నమ్మశక్యంగా ఉండవు. ఇలాంటి ఘటనలు మనం స్వయంగా చూస్తేనే నమ్ముతాము. కానీ ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకోవడంతో అక్కడే ఉన్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఇంతకీ ఈ ఘటన ఏమిటి, ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా? ఏపీలోని చిత్తూరు జిల్లాలోని మదనపల్లి మండలం కట్టుబావి సమీపంలో ఈ వింత చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

కట్టబావి సమీపంలోని ఓ చెట్టుకింద రెండు రోజులుగా ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించాడు. ఇది గమనించిన స్థానికులు ఆ గ్రామ వీఆర్వో, కార్యదర్శిలకు సమాచారం అందించారు. దీంతో సదరు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని పరిశీలించి, అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అతడిని ఎవరూ గుర్తించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా పరిగణించిన అధికారులు, అతడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కాగా అతడిని పాడెపై మోసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. దీంతో ఆ పాడె మోస్తున్న వారితో సహా, అక్కడున్న వారు పరుగులు తీశారు.

శవం లేచి కూర్చోవడంతో అధికారులు వెంటనే అతడిని 108లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడు బతికే ఉన్నాడని తేల్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శవం లేచి కూర్చుందనే వార్త స్థానికంగా సంచలనంగా మారింది.