బండి సంజయ్, రేవంత్ రెడ్డి లకు లీగల్ నోటీసులు పంపిన మంత్రి కేటీఆర్

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో తనపై విమర్శలు చేస్తున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ నోటీసులు జారీ చేసారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని..లేకపోతే రూ.100కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసులో పేర్కొన్నారు.

తెలంగాణలో తాజాగా సంచలనం రేపిన సంఘటన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహరమే. ఈ పేపర్ లీకేజీ వ్యవహరంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ క్రమంలోనే పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా గానీ తన పేరును వాడుతున్నారు అంటూ ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

లీకేజీ విషయంలో మంత్రి కేటీఆర్‌తో పాటు కార్యాలయానికి సంబంధం ఉందని రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడంతో పాటు మంత్రివర్గం నుంచి తొలగించడంతో పాటు ఐటీ శాఖను నిర్వహిస్తున్న కేటీఆర్ పేపర్ లీకేజీ బాధ్యత వహించాలన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌, బీజేపీ నేతలిద్దరూ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో దురుద్దేశంతో ఆరోపణలు చేశారని నోటీసులు మంత్రి ఆరోపించారు. లీక్ కేసులో తన పేరును ఉపయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోకాలంగా ప్రజాజీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలనే దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డి పదేపదే అబద్దాలు చెబుతున్నారని, కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారిపై అసత్య ఆరోపణలు చేసే లేదంటూ ఐపీసీ 499, 500 నిబంధనల ప్రకారం.. పరువు నష్టం కింద నోటీసులు పంపారు.