ఆస్ట్రేలియాలో ఫేస్‌బుక్‌ వార్తలసేవలు నిలిపివేత

మండిపడుతున్న ప్రభుత్వం, మీడియా సంస్థలు 

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాకు చెందిన వార్త సంస్థలు పంచుకోనే సమాచారాన్ని చదవగల సదుపాయాన్ని ఫేస్‌బుక్‌ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు ఆ దేశ వాసులు ఫేస్‌బుక్‌లో వార్తలను కూడా చదివే అవకాశాన్ని ఆపేసింది. వార్తలు షేర్ చేస్తే సంబంధిత మీడియా సంస్థలకు సోషల్ మీడియా సైట్లు చెల్లింపులు చేయాలన్న ఆ దేశ కొత్త చట్టం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్ బుక్ వెల్లడించింది.

అయితే, దాని ప్రభావం ఒక్క వార్తల మీదే పడలేదు. అత్యవసర విభాగాలపైనా పడింది. అగ్నిమాపక విభాగం, ఆరోగ్య శాఖ, వాతావరణ శాఖతో పాటు పలు అత్యవసర సేవలకు సంబంధించి వార్తా సమాచారం ఆగిపోయింది. దీనిపై ఆయా విభాగాలు, ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. అత్యవసర సేవల పేజీల్లో వార్తలను ఎలా బ్లాక్ చేస్తారని మండిపడ్డారు. దీంతో ఫేస్ బుక్ స్పందించింది. ప్రభుత్వ పేజీలకు ఎలాంటి అంతరాయం ఉండదని, ఇవ్వాళ్టి నిర్ణయ ప్రభావం వాటిపై పడబోదని స్పష్టతనిచ్చింది. కొన్ని స్వచ్ఛంద సంస్థల పేజీలకూ ఈ బాధ తప్పలేదు.

మరోపక్క, ఫేస్ బుక్ చర్యపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. వార్తలు షేర్ కాకుండా బ్లాక్ చేయడం ప్రమాదకర సంకేతమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, అధికారిక గ్రూపులనూ వార్తల విషయంలో బ్లాక్ చేయడం వల్ల.. తప్పుడు వార్తల బెడద పెరిగిపోయే ప్రమాదముందని మీడియా సంస్థలు, ఆస్ట్రేలియా ప్రభుత్వం మండిపడ్డాయి. కొన్ని ఫేస్ బుక్ పేజీల్లో నిరంతరం తప్పుడు వార్తలు, పుకార్లు ఎక్కువగా షేర్ అవుతున్నాయని, ఇకపై వాటికి అడ్డూఅదుపు అనేవి ఉండవని అసహనం వ్యక్తం చేశాయి.

పేజీలను బ్లాక్ చేసేముందు ఫేస్ బుక్ బాగా ఆలోచించుకోవాల్సిందని ఆ దేశ సమాచార శాఖ మంత్రి పాల్ ఫ్లెచర్ అన్నారు. మీడియా సంస్థల పేజీలనూ బ్లాక్ చేయడమంటే దానికన్నా దారుణమైన విషయం ఉండదన్నారు. అయితే, ఫేస్ బుక్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

చట్టంలో చాలా లోపాలున్నాయని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫేస్ బుక్ మేనేజర్ విలియం ఈస్టన్ అన్నారు. వినియోగదారులతో సంబంధాలపై నిజానిజాలను మరచి చట్టాలను పాటించాలా? లేక యూజర్లు వార్తలు షేర్ చేయకుండా బ్లాక్ చేయాలా? అన్న దానిపై ఎంతగానో ఆలోచించామని, చివరకు దురదృష్టవశాత్తూ రెండో దానికే కట్టుబడ్డామని, వేరే దారి లేదని చెప్పారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/