భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్..అధికారులకు కీలక ఆదేశాలు

minister-ktr

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. మరో నాల్గు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. బుధువారం నానక్‌రామ్‌గూడలోని కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో భారీ వర్షం నేపథ్యంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని, ఇందుకోసం అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అన్నిశాఖల సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు.

జలమండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసు వంటి విభాగాలు నిత్యం సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వరదల్లో ప్రాణనష్టం కూడదని ఆదేశించారు. జీహెచ్ఎంసీ వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను కూడా ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు కేటీఆర్ కు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో డీవాటరింగ్ పంపులు ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని మోహరించినట్లు పేర్కొన్నారు.