అంకెల గారడీతో లేని అప్పును చూపుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం – కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం కు దీటుగా బిఆర్ఎస్ స్వేద పత్రాన్ని ఆదివారం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ విడుదల చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..గత తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.3,17,015 కోట్ల అప్పు చేసిందని, అదే సమయంలో దాదాపు రూ.50 లక్షల కోట్ల సంపదను సృష్టించిందని తెలిపారు.

కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం తెచ్చిన అప్పులతో పోలిస్తే దాదాపు 16 రెట్లు అధికంగా ఆస్తుల కల్పన జరిగిందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం భారీగా అప్పులు తెచ్చినట్టు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గత తొమ్మిదిన్నర ఏండ్లలో తెలంగాణ రూ.6,71,757 కోట్లు అప్పు తెచ్చిందంటూ అంకెల గారడీలు, అభాండాలతో రేవంత్‌ సర్కారు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.

రాష్ట్రంలో వ్యవసాయ, విద్యుత్తు, నీటిపారుదల రంగాల అభివృద్ధికి గత తొమ్మిదన్నర ఏండ్లలో ఎంతో కృషి చేశామని, విద్యుత్తు రంగంలో రూ.1,37,517 కోట్లు ఖర్చు చేసి.. రూ.6,87,585 కోట్ల విలువైన ఆస్తులను సృష్టించామని కేటీఆర్‌ వివరించారు. సాగు విస్తీర్ణాన్ని 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.68 కోట్ల ఎకరాలకు వరిధాన్యం ఉత్పత్తిని 68 లక్షల టన్నుల నుంచి 350 లక్షల టన్నులకు పెంచామని , శ్వేతవిప్లవంతో పాల ఉత్పత్తిని 4.2 నుంచి 5.8 మిలియన్‌ టన్నులకు పెంచామని, గులాబీ విప్లవంతో గొర్రెల సంఖ్య 12.8 నుంచి 19.1 మిలియన్లకు పెరిగిందని, నీలి విప్లవంతో చేపల ఉత్పత్తిని 2.68 నుంచి 3.90 లక్షల టన్నులకు పెంచమని , పసుపు విప్లవంతో ఆయిల్‌పామ్‌ సాగును 27,376 ఎకరాల నుంచి 20 లక్షల ఎకరాలకు పెంచామని , తెలంగాణ ఏర్పడే నాటికి 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.1,12,162గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయాన్ని తొమ్మిదిన్నర ఏండ్లలో రూ.3,17,115కు పెంచామని, ఇదే సమయంలో జీఎస్‌డీపీని రూ.4.51 లక్షల కోట్ల నుంచి రూ.13.27 లక్షల కోట్లకు పెంచగలిగామని గుర్తు చేశారు. రాష్ట్రానికి స్థూలంగా ఉన్న రుణాలు రూ.3,17,051 కోట్లు మాత్రమేనని, దీనికి విరుద్ధంగా రేవంత్‌ సర్కారు లేని అప్పును ఉన్నట్టు చూపి తిమ్మిని బమ్మిని చేస్తున్నదని ధ్వజమెత్తారు.