అధికారులు ప్రతి రోజు 18 గంటలు పనిచేయాల్సిందే..సీఎం రేవంత్ ఆదేశాలు

తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి కూడా రేవంత్ రెడ్డి తన మార్క్ పాలన ను కొనసాగిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే పలు శాఖల్లో అధికారులను మారుస్తూ..వారికీ దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రజా పాలన కార్యక్రమం అమలుపై ఆదివారం సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ..ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు ప్రతి రోజు 18 గంటలు పని చేయాల్సి ఉంటుందని, దీనికి మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎవరికైనా ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో ఇష్టం లేకుంటే, ఎకువ పనిచేయాల్సిన ఈ బాధ్యత తమకు ఎందుకు? అనిపిస్తే నిరభ్యంతరంగా చెప్పాలని, వారిని బదిలీ చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.

గ్రామసభల ద్వారా నిస్సహాయులకు సంక్షేమ ఫలాలు అందించేందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనికి అధికారులే వారధిగా ఉండాలని చెప్పారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభలను నిర్వహిస్తున్నామని, ఇందుకు సంపూర్ణమైన సహకారం ఉండాలని కలెక్టర్లకు సూచించారు. పకడ్బందీగా సమాచారాన్నిసేకరించి, డిజిటలైజ్‌ చేసి ప్రభుత్వానికి పంపిస్తే.. వాటిని స్రూటినీ చేసి అర్హులకు సంక్షేమ పథకాలు అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తమ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వమని, అయితే పరిపాలనలో నిర్లక్ష్యం వహించినా, ఉద్దేశపూర్వకంగా పిచ్చి నిర్ణయాలు తీసుకున్నా అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు.