ఆరు గ్యారెంటీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీలకు సంబంధించి ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తామని చెప్పారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకూ గ్రామ సభల ద్వారా ఆ దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ‘అర్హత ఉన్న వారు గ్రామ సభల్లో అధికారులకు అప్లికేషన్లు అందజేయాలి. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన అనంతరం అధికారులు ఓ రశీదు ఇస్తారు. గూడెంలో 10 ఇళ్లు ఉన్నా అధికారులే స్వయంగా అక్కడికి వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు. స్వీకరణ ప్రక్రియ పూర్తైన అనంతరం వారు ఏ పథకానికి అర్హులో అధికారులే నిర్ణయిస్తారు.’ అని వివరించారు.

ఈ పథకాలకు విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని, ప్రస్తుతానికి తెల్లరేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు వెల్లడించారు. రేషన్‌కార్డు ఉన్నవారి అర్హతల ఆధారంగా దరఖాస్తు తీసుకుంటామని చెప్పారు. కొత్త రేషన్‌ కార్డులకు, రైతుబంధుకు కూడా ఇక్కడే దరఖాస్తులు తీసుకోబోతున్నట్టు తెలిపారు. పథకాలకు సంబంధించి దరఖాస్తుకు సమయం తక్కువగా ఉన్నదని ఆందోళన చెందొద్దని ప్రజలకు మంత్రి పొంగులేటి సూచించారు. ‘ఇదే చివరి అవకాశం కాదు. ఇది నిరంతర ప్రక్రియ. రద్దీ ఎక్కువగా ఉండి దరఖాస్తు చేసుకోలేనివారి నుంచి తర్వాత దరఖాస్తు తీసుకుంటాం. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి వారి అర్హతను బట్టి చిత్తశుద్ధితో దరఖాస్తు తీసుకుంటాం’ అని తెలిపారు.