కడియం శ్రీహరి నమ్మించి గొంతు కోశాడు – కేటీఆర్

కేసీఆర్ ను కడియం శ్రీహరి నమ్మించి గొంతు కోశాడు అని ఆరోపించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. వీరిలో బిఆర్ఎస్ నుండి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం ఫై పార్టీ నేతలు , బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఒకరు. తన కూతురి రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారినట్లు చెప్పుకొచ్చారు. కడియం కూతురు కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. ఈ తరుణంలో కడియం శ్రీహరి ఫై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

కేసీఆర్ ను కడియం శ్రీహరి మోసం చేసినంతంగా ఎవరూ చేయలేదని అన్నారు. ‘ఇన్నేళ్లలో కేసీఆర్ ను చాలా మంది మోసం చేశారు. కానీ కడియం శ్రీహరి చేసింది నయ వంచన. తన కూతురికి ఎంపీ టికెట్ తీసుకుని మధ్యాహ్నం కేసీఆర్తో భోజనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ రోజు సాయంత్రానికి పార్టీ మారారు. ఇది నమ్మించి గొంతు కోయడమే’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటె వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా డాక్టర్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌ను పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. హనుమకొండ జిల్లా వాసి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ ప్రస్తుతం హనుమకొండ జిల్లా పరిషత్తు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా, అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్‌కుమార్‌ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహాలు, సూచనల మేరకు అధినేత కేసీఆర్‌ సుధీర్‌కుమార్‌ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.