కవిత సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి

Court approves Kavita’s CBI custody

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కవితను సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితను సీబీఐ విచారించనుంది.

రేపటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు తమ కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేయనుంది. కవితను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. కోర్టు 3 రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పలు అంశాలపై కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కవితను విచారించింది. ఇప్పుడు సీబీఐ కూడా మరికొన్ని అంశాలపై కవితను ఎంక్వైరీ చేయనుంది.

సీబీఐ వాదనలు, రిమాండ్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుని కవితను మూడు రోజుల కస్టడీకి అనుమతించారు జడ్జి కావేరి బవేజా. తదుపరి విచారణను ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. కవితకి వ్యతిరేకంగా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సప్ చాట్స్ సహా పలు ఆధారాలను కోర్టుకు సమర్పించింది సీబీఐ. కవితను 5 రోజుల కస్టడీకి సీబీఐ కోరగా 3 రోజుల కస్టడీకి అనుమతించి ఇచ్చింది కోర్టు.

లిక్కర్ పాలసీ రూపకల్పన అక్రమాల్లో కవిత సూత్రధారిగా సీబీఐ పేర్కొంది. కవిత, గోరంట్ల బుచ్చిబాబు (కవిత ఆడిటర్) ఫోన్ల వాట్సాప్ చాట్స్, కవిత పీఏ అశోక్ కౌశిక్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, దినేశ్ అరోరా ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు సీబీఐ తెలిపింది. లిక్కర్ పాలసీ.. మద్యం వ్యాపారులకు అనుకూలంగా తయారు చేయడం, అందుకోసం సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చడంలో కవిత కీలక సూత్రధారిగా పనిచేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సీబీఐ.