దావోస్ పర్యటన లో రాష్ట్రానికి 4200 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన కేటీఆర్

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజవంతంగా పూర్తి అయ్యింది. ఈనెల 18 లండన్ కు చేరుకున్న కేటీఆర్, యూ కే తో పాటు స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలలో పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల నేపథ్యంలో ప్రపంచంలోని అనేక ప్రముఖ కంపెనీల ప్రతినిధి బృందాలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాల గురించి, రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాల గురించి వారికి వివరించారు.

ఈ పర్యటనలో మొత్తం 45 కంపెనీల ప్రతినిధి బృందాలతో సమావేశమైన ఆయన.. సుమారు 4200 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చేలా చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ప్రభు త్వ విధానాలతో పాటు, పెట్టుబడి అవకాశాల గురించి ప్రపంచ వేదికపై వివరించడానికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటన విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, వ్యాపార వాణిజ్య సంస్థలకు.. యూకే, స్విట్జర్లాండ్‌ దేశాల్లోని చెందిన ఎన్నారైలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.