విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తా – వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రైల్వే జోన్ రావటం లేదనే వార్తలు అవాస్తవమని అన్నారు. విశాఖ రైల్వే జోన్ రాష్ట్ర విభజన చట్టం లో ఉన్న హామీ అని… అప్పటి ప్రధానమంత్రి కూడా రాజ్యసభలో ఈ అంశాన్ని స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు.

కేంద్ర ప్రభుత్వంతో నిన్న జరిగిన చర్చలో రైల్వేజోన్‌ ప్రస్తావనే రాలేదని, వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించాలని కొంతమంది అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. రైల్వేజోన్‌ వందశాతం వచ్చి తీరుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో నిన్నటి సమావేశంలో కొవ్వూరు మీదుగా రాజధాని, తెలంగాణలోని ప్రాంతాలను కలుపుతూ హైదరాబాద్‌ను కనెక్ట్‌ చేసే రైల్వేలైన్‌పై చర్చ జరిగింది. దీనిపై రాష్ట్రానికి సంబంధించిన వాటా ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదన. కొవ్వూరు మీదుగా రైల్వేలైన్‌ రాజధాని, తెలంగాణలోని గ్రామాల మీదుగా హైదరాబాద్‌ను కనెక్ట్‌ చేయాలనే ప్రతిపాదనను పునర్విభజన చట్టంలోనే పొందుపరిచారు కాబట్టి.. మొత్తం కేంద్రమే భరించాలని మన వాదన. దీనికి సంబంధించి చర్చ వచ్చింది. కానీ, రైల్వేజోన్‌కు సంబంధించిన అంశం చర్చకు రాలేదు. రైల్వేజోన్‌ తప్పకుండా వస్తుందన్నారు.