జగన్ తో ఎలాంటి పంచాయితీ లేదు – కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో ఎలాంటి పంచాయితీ లేదన్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. రాష్ట్రాల విభజన తర్వాత ఉండే కొన్ని అంశాలు.. కేంద్రం తేల్చాల్సిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నాయన్నారు. అంతే కానీ ఎటువంటి సమస్యలు లేవన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్​ తనకు పెద్దన్న లాంటి వారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్​తో కూడా జగన్​కు చక్కని సంబంధాలు ఉన్నాయన్నారు. తమకు ఏనాడు కూడా పంచాయితీలు లేవన్నారు. రాజకీయాల్లో ఎవరూ శత్రువులు ఉండరన్న కేటీఆర్.. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని అన్నారు.

గతంలో చంద్రబాబునాయుడుతోనూ తామెప్పుడూ వివాదాలు పెట్టుకోలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం తమ ప్రత్యర్థి పార్టీతో చేతులు కలపడం వల్లే ఆయనతో దూరం పెరిగిందని అన్నారు. పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, అందిరతోనూ సత్సంబంధాలే కోరుకుంటామన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేసీఆర్​ అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది తామేనని కేటీఆర్ తేల్చి చెప్పారు. కేటీఆర్ భవిష్యత్ ప్రధాని అన్న వెంచర్ కేపిటలిస్ట్ వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. సీఎం దయతో తాను మంత్రిగా ఉన్నానని, తనకు ఇంతకుమించి ఆశలు లేవని స్పష్టం చేశారు.