పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని పవన్ డిమాండ్

pawan kalyan demands Rs 1 Cr compensation in Eluru fire accident
pawan kalyan demands Rs 1 Cr compensation in Eluru fire accident

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 6 గురు మృతి చెందగా..13మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆ 13 మందిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. రసాయన పరిశ్రమలోని నాలుగో యూనిట్‌లో మంటలు చెలరేగి.. రియాక్టర్​ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన పట్ల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఏమిటి..? అని పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. అగ్నిప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ఆంధ్రా ఆస్పత్రిలో హోం మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పోరస్‌ ఫ్యాక్టరీ ప్రమాదం చాలా బాధాకరం. బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. బాధితులందరికీ అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నుండి 25 లక్షలు, ఫ్యాక్టరీ నుండి 25 లక్షలు మొత్తం 50 లక్షలు పారితోషికం ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. ఇక్కడ ఫ్యాక్టరీ వద్దని స్థానికులు అంటున్నారు. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించాం. అవసరమైతే ఫ్యాక్టరీని సీజ్‌ చేస్తాం’ అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు.