డీకే అరుణతో భేటీ అయిన విశ్వేశ్వరరెడ్డి

ఆలస్యం చేయకుండా బీజేపీలో చేరాలని కోరిన అరుణ

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీలోకి వలసలు పెరిగేలా కనిపిస్తున్నాయి. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు టీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచిన ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత కొంతకాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వస్తున్న కొండా.. నిన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో ఆమె ఫాంహౌస్‌లో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డిని అరుణ బీజేపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. దీంతో ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే కొండా కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.


కాగా, టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో నాలుగైదు రోజుల్లో కాషాయ పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. అయనతోపాటు ఏనుగు రవీందర్ సహా ఐదుగురు బీజేపీలోకి వెళ్లబోతున్నారు. ఈ మేరకు ఈటల నేడు టీఆర్ఎస్‌కు, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/